మీ డబ్బు. ₹2 లక్షల కోట్లు మూలన పడి ఉంది.. వచ్చి తీసుకోండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు | Unclaimed Financial Assets Nirmal Seetharaman Open Offer
మన ఆర్థిక వ్యవస్థలో ఎవరూ ఊహించని ఓ పెద్ద నిధి మూలపడి ఉంది. అది మరెవరిదో కాదు, మన కష్టార్జితమే! బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల్లో దాదాపు రూ. 1.84 లక్షల కోట్ల విలువైన భారీ మొత్తంలో క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడించారు. ఈ డబ్బును నిజమైన యజమానులు, వారి వారసులు వచ్చి తీసుకోవాలని ఆమె దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘అప్కి పూంజి, అప్కా అధికార్’ (మీ డబ్బు, మీ హక్కు) అనే మూడు నెలల దేశవ్యాప్త ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. ఈ డబ్బులో మీ వాటా కూడా ఉందేమో తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఇది. కేంద్రం ఈ ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకుని, ఈ భారీ మొత్తాన్ని ప్రజలకు చేర్చేందుకు నడుం కట్టింది.
సాధారణంగా ఈ క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అనేవి ఏ రూపంలో ఉంటాయి? ఎక్కువగా గడువు ముగిసిన లేదా యజమాని స్పందించని బ్యాంక్ డిపాజిట్లు, మెచ్యూర్ అయిన బీమా పాలసీలు, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బ్యాలెన్స్‌లు, ఇంకా ట్రేడ్ కాని షేర్ల రూపంలో ఈ డబ్బులు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఖాతాదారులు చనిపోయిన తర్వాత, లేదా చిరునామా మారడం వల్ల సరైన వారసత్వ ధ్రువాలు లేక ఈ డబ్బులు అలాగే ఉండిపోతుంటాయి. ఈ మొత్తం రూ. 1.84 లక్షల కోట్లలో దాదాపు రూ. 2 లక్షల కోట్లు మన కుటుంబీకులు, వారసత్వం రిత్యా మనకు సిద్ధించేటువంటివేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మూడు నెలల ప్రచారంలో ‘అవగాహన’, ‘యాక్సెస్’, ‘చర్య’ అనే మూడు అంశాలపై దృష్టి సారించాలని కోరారు. అంటే, ముందుగా ఈ క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. ఆ తర్వాత, తమ డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సులభమైన యాక్సెస్ (మార్గాలు) అందించాలి. చివరగా, నిజమైన యజమానులకు ఆ డబ్బు చేరేలా వేగవంతమైన చర్యలు తీసుకోవాలి.
ఇది దేశ పౌరులందరికీ తమ వారసత్వ డబ్బు తిరిగి పొందేందుకు లభించిన అరుదైన అవకాశం. కాబట్టి, మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న పాత బ్యాంక్ డిపాజిట్లు, బీమా పాలసీలు, పెట్టుబడుల వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది. కేంద్రం చేపట్టిన ఈ ప్రచారం ద్వారా మీ కష్టార్జితం లేదా మీ కుటుంబీకుల ఆస్తిని వెనక్కి పొందే అవకాశం ఉంది. అటు అధికారులు, ఇటు ప్రజలు సమన్వయంతో కృషి చేస్తే ఈ భారీ మొత్తంలో ఉన్న క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు నిజమైన లబ్ధిదారులకు చేరుతాయి.