ఇల్లు లేదా భూమి కొనేవారు ఈ 13 పత్రాలు చెక్ చేసుకోండి.. లేదంటే వచ్చే సమస్యలు ఇవే.. | Buying Home Title Deed With 13 Need Important Documents Details
సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలంటే లక్షల నుండి కోట్ల రూపాయలు వెచ్చించక తప్పదు. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు, చిన్న పొరపాటు కూడా జీవితంలో పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. అందుకే, మీరు కట్టిన ఇంటిని కొనుగోలు చేసినా, లేదా స్థలం కొని ఇల్లు కట్టుకోవాలని భావించినా కొన్ని ముఖ్యమైన చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో స్థానిక మున్సిపల్ అధికారులు, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం లేదా బ్యాంకులతో సమస్యలు తప్పవు.
టైటిల్ డీడ్ (Title Deed) వివాదాలు లేకుండా చూసుకోవడం అత్యంత కీలకం. మీరు కొనుగోలు చేస్తున్న ఇంటికి సంబంధించి ఈ టైటిల్ డీడ్ (ఒరిజినల్) ప్రస్తుత విక్రయదారు పేరు మీదనే ఉందా? లేదా అనే విషయాన్ని ముందుగా ధృవీకరించుకోవాలి. అలాగే, ఆస్తి ఎవరెవరి పేరుపై చేతులు మారింది, గతంలో జరిగిన విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పాత టైటిల్ డీడ్ పత్రాలను కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ఉంటే రెవెన్యూ రికార్డులను, పట్టణ ప్రాంతాల్లో అయితే మ్యూటేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఈ రికార్డులలో తేడాలు ఉంటే ఆస్తిపై చట్టబద్ధమైన హక్కుల విషయంలో సమస్యలు రావచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు (Possession) తెలిపే ఒరిజినల్ సర్టిఫికెట్, బిల్డింగ్ కట్టడానికి సంబంధించి అధికారులు ఇచ్చిన శాంక్షన్ లెటర్, ఆమోదించిన మ్యాప్ వంటి పత్రాలు విక్రయదారు వద్ద ఉన్నాయో లేదో చూడాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇచ్చే ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌తో పాటు పూర్తి ప్లాన్ కూడా చాలా అవసరం. ఈ పత్రాలు లేకపోతే ఆ నిర్మాణం అనధికారికం అని భావించి స్థానిక మున్సిపల్ అధికారం ఆస్తిని సీల్ చేసే లేదా కూల్చివేసే ప్రమాదం ఉంది. ఆస్తి కొనుగోలు చిక్కులు రాకుండా ఉండాలంటే చట్టపరమైన అంశాలపై పట్టు ఉండాలి.
ఖచ్చితంగా చెక్ చేయాల్సిన ఆర్థిక మరియు ప్రభుత్వ రికార్డులలో ప్రధానమైనవి: అన్ని రకాల పేమెంట్లకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు రశీదులు, విద్యుత్తు, నీటి బిల్లుల చెల్లింపు పత్రాలు. వీటిలో ఏమైనా బకాయిలు ఉంటే, కొత్త యజమానిగా మీరే చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి ‘నో ఎన్‌కాంబ్రాన్స్ సర్టిఫికెట్’ (ఎటువంటి అప్పులు లేదా తనఖాలు లేవని తెలిపే పత్రం) పొందడం చాలా ముఖ్యం. హోమ్ లోన్ వివరాల కోసం CERSAI సర్టిఫికెట్‌ను కూడా తనిఖీ చేయడం ద్వారా ఆస్తిపై బ్యాంకులు ఎక్కడైనా తనఖా పెట్టాయేమో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆస్తి యజమాని కంపెనీ అయితే, MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) రికార్డులను కూడా తప్పక పరిశీలించాలి. ఈ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉంటేనే మీ టైటిల్ డీడ్ సురక్షితంగా ఉన్నట్టు.
చివరిగా, కొందరు ప్రాథమిక పత్రాలు చూసి సంతృప్తి చెంది మొత్తం ప్రక్రియను ముగిస్తారు. కానీ, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వివాదాలు, భూ వినియోగ ఉల్లంఘనలు, లేదా యూటిలిటీ (కరెంట్, నీరు) సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే పైన పేర్కొన్న 13 ముఖ్యమైన పత్రాలను నిశితంగా పరిశీలించడం, అవసరమైతే చట్ట నిపుణుల సహాయం తీసుకోవడం తెలివైన పని. అప్పుడే సొంతింటి కల నెరవేరిన నిజమైన సంతోషం మీకు దక్కుతుంది.
