తాజా వార్త: నిరుద్యోగులకు శుభవార్త..ఒక్కసారి కార్డు తీసుకుంటే చాలు.. కార్డు శాశ్వతంగా చెల్లుబాటు | Employment Card Latest Information 2025
నిరుద్యోగులకు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ కార్డు విషయంలో మూడు సంవత్సరాలకోసారి అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాత విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి, యువతకు ఊరటనిచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, ఒకసారి కార్డు తీసుకుంటే.. అది ఉద్యోగం వచ్చే వరకు లేదా 54 సంవత్సరాలు పూర్తయ్యే వరకు శాశ్వతంగా చెల్లుబాటు అవుతుంది.
గతంలో నిరుద్యోగులు తమ ఎంప్లాయ్‌మెంట్ కార్డును ప్రతి మూడేళ్లకోకసారి తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. ఈ కారణంగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద భారీగా క్యూలు ఉండేవి. గడువులోగా అప్‌డేట్ చేయకపోతే కార్డులు రద్దయ్యేవి (లాప్స్ అయ్యేవి). ఈ సమస్యను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అభ్యర్థులకు ప్రయాస తగ్గింది.
అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇప్పటికీ ఎంప్లాయ్‌మెంట్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ కార్డును షరతుగా విధిస్తున్నాయి. గతంలో ఈ కార్డు ఆధారంగానే సీనియారిటీ ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచేవారు. ఇప్పుడు ఆ విధానం రద్దయినా, జాబ్ మేళాలు నిర్వహించే ఉపాధి కల్పన సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవాలంటే ఈ కార్డు తప్పనిసరి.
నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ-సేవ కేంద్రాల ద్వారా కానీ, లేదా ఆన్‌లైన్‌లో www.employment.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇచ్చిన వివరాలను అధికారులు పరిశీలించి కార్డు జారీ చేస్తారు. ఈ వివరాలను జాతీయస్థాయి వెబ్‌సైట్ www.ncs.gov.in కు కూడా అనుసంధానిస్తారు. కాబట్టి, నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
